*119వ కీర్తనా ధ్యానం*
(27వ భాగము)
*నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము*.
కీర్తనలు 119:38
*దేవుని వాక్యము మనుష్యులలో భయమును పుట్టిస్తుంది.*
భక్తి చేస్తున్నాము కానీ, ఆ భక్తిలో భయము లోపించింది. భయములేని భక్తి వ్యర్థం.
మన దృష్టిలో భక్తి చెయ్యడం అంటే?
 ఆదివారం ఆరాధనకు వెళ్లడం.
 కానుకలు సమర్పించడం.
 బైబిల్ పట్టుకొని తిరగడం.
 మెడలో సిలువ
 గోడలకు దేవుని వాక్యాలు
 ఈ గృహాధిపతి యేసే అనే బోర్డులు. ఇట్లా.....
కానీ, ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు? మనము పరిశుద్ధ దేవుని బిడ్డలం అనిగాని, మెడలో సిలువ వుంది అనే తలంపుగాని మనకు రాదు.
ఇంట్లో దుర్భాషలు మాట్లాడేటప్పుడు, టీవీ లలో సినిమాలు, సీరియల్స్, సినిమా పాటలు వినబడుతున్నప్పుడు అదే గదిలో దేవుని వాక్యం ( దేవుని వాక్యం అంటే దేవుడే) వ్రేలాడుతుంది అనే తలంపు మన దరిదాపుల్లోనికి కూడా రాదు.
 కారణం?
దేవుని గురించిన భయము లేదు.
అయితే, దేవుని గురించిన భయము మనకెట్లా కలుగుతుంది?
పరిశుద్ధ గ్రంధమును ధ్యానించడం ద్వారానే.
"నీ విచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది"
కీర్తనలు 119:38
నాణెమునకు ఒక వైపు మాత్రమే చూస్తున్నాం! ఆవైపున ఆయన దయామయుడు, కృపామయుడు, ప్రేమమయుడు, గొర్రెపిల్లలా... కనిపిస్తున్నాడు. దేవుడు అంటే అంతే. చివరి క్షణంలో ప్రార్ధించినా క్షమించేస్తాడు అనే చులకన భావం మనలో వుండిపోయింది.
అయితే, నాణెమును రెండవ వైపుకు త్రిప్పితే ఆయన మరొక రకంగా కనిపిస్తాడు.
రోషముగలవాడుగా , దహించుఅగ్నిలా, న్యాయాధిపతిగా, యూదాగోత్రపు సింహములా కనిపిస్తాడు . ఈ కోణంలోఆయనను ఎదుర్కోవడం మనవల్ల కాదు.
ఆయన ఏమిటో మనకు అర్ధం కావాలంటే? ఒక్కటే మార్గం. పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించడమే.
ఆయన యందుగల భయము, మనకు క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఇస్తుంది.ఆ జీవితము పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది, ఆ పరిశుద్ధత మనలను నిత్య రాజ్యమునకు చేర్చుతుంది.
"రెండవవాడు వానిని గద్దించినీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా?
లూకా 23:40
సిలువలో ఆ రెండవ దొంగకు దేవుని పట్ల గల భయము అతనిని పరదైసుకు చేర్చ గలిగింది.
 మోరియా పర్వతము మీద అబ్రాహాము ఇస్సాకును బలి అర్పించడానికి సిద్ధపడుతున్న సమయంలో.....
అప్పుడు ఆయన ఆ చిన్నవానిమీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనడడుచునదనెను.
ఆదికాండము 22:12
ఎప్పుడయితే దేవునికి భయపడేవారిగా వుంటామో? అప్పుడు ఆయన కోసం మనము ఏదయినా చెయ్యడానికి సిద్దపడతాము. మనకోసం ఆయన ఏదైనా చెయ్యడానికి ఇష్టపడతాడు.
ఆ భయము ఎట్లా కలుగుతుంది అంటే? వాక్యమును ధ్యానించడం ద్వారానే. అందుకే, కీర్తనాకారుడు నీ సేవకునికి దాని స్థిరపరచుము. అంటూ ప్రార్ధిస్తున్నాడు.
ఆయన వాక్యానికి భయపడదాం!
జీవితాన్ని సరిచేసుకుందాం!
శాశ్వత రాజ్యానికి వారసులవుదాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*
إرسال تعليق